Green Moong Dal Chaat : మొలకెత్తిన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. పెసర్లను కూడా మొకెత్తించి తీసుకుంటూ ఉంటాం. మొలకెత్తిన పెసర్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఇలా అనేక విధాలుగా మనకు మేలు కలుగుతుంది. అయితే చాలా మంది వీటిని నేరుగా తినడానికి ఇష్టపడరు. వీటిని తినడానికి ఇష్టపడని వారు వాటితో చాట్ ను చేసుకోవడం వల్ల చక్కగా తినవచ్చు. పెసర్ల మొలకల చాట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర మొలకల చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర మొలకలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాటా – 1, చిన్నగా తరిగిన కీరదోస – సగం ముక్క, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – రెండున్నర టీ స్పూన్స్, ఉప్పు – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, గరం మసాలా – పావు టీ స్పూన్.
పెసర మొలకల చాట్ తయారీ విధానం..
ముందుగా పెసర మొలకలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పెసర మొలకల చాట్ తయారవుతుంది. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా పెసర మొలకలే కాకుండా ఇతర మొలకెత్తిన గింజలతో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.