Green Moongdal Curry : పచ్చ పెసలతో రుచికరమైన కూర.. రైస్, చపాతీ.. రెండింటిలోకి అదిరిపోతుంది..!

Green Moongdal Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర్లు కూడా ఒక‌టి. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పెస‌ర్లను మొల‌కెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో గుగ్గిళ్లు, గారెలు, పెస‌ర‌ట్టు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర్ల‌తో చేసే కూర రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెస‌ర్ల‌తో రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర్ల కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర్లు – ఒక టీ గ్లాస్, నీళ్లు – 3 టీ గ్లాసులు, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5 లేదా కారానికి త‌గిన‌న్ని, ఎండుమిర్చి – 2, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాటాలు – 2 , ఉప్పు – త‌గిన‌న్ని, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Green Moongdal Curry recipe in telugu make in this method
Green Moongdal Curry

పెస‌ర్ల కూర త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర్ల‌ను నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి కుక్క‌ర్ లో వేసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి ప‌సుపు వేసుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి మ‌రోసారి ప‌ప్పును క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సలా వేసి క‌ల‌పాలి.

వీటిని అర నిమిషం పాటు వేయించిన త‌రువాత ఉడికించిన పెస‌ర్ల‌ను నీటితో స‌హా వేసుకుని క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. కూర మ‌రీ చిక్క‌బ‌డే వ‌ర‌కు కాకుండా కొద్దిగా ప‌లుచ‌గా ఉండేలా ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల కూర త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పెస‌ర్ల‌తో ఈ విధంగా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వచ్చు.

D

Recent Posts