Guddu Karam Pulusu : ఎక్కువ పోషకాలను, తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను తినడం వల్ల మనం ఎన్నో రకాల పోషకాలను పొందవచ్చు. వైద్యులు కూడా మనకు రోజుకు ఒక ఉడికించిన కోడిగుడ్డును తినమని సూచిస్తూ ఉంటారు. కేవలం ఉడికించిన కోడిగుడ్డునే కాకుండా కోడిగుడ్డుతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాలను అందరూ ఇష్టంగా తింటారు. కోడిగుడ్డుతో గుడ్డు కారం పులుసును రుచిగా, సలుభంగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 5, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పసుపు- అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – కఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), చిన్నగా తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 15 గ్రా., నీళ్లు – ఒక గ్లాస్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

గుడ్డు కారం పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పావు టీస్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి కళాయిలో వేసుకుని వేయించాలి. ఇవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో మరింత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. పులుసు కొద్దిగా మరిగిన తరువాత వేయించిన కోడిగుడ్లు వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుడ్డు కారం పులుసు తయారవుతుంది. అన్నంతో కలిపి తింటే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన కోడిగుడ్డు పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా కోడిగుడ్డుతో పులుసును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు కోడిగుడ్డులోని పోషకాలను కూడా పొందవచ్చు.