Chepala Nilva Pachadi : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండే ఆహార పదార్థాల్లో చేపలు ఒకటి. చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చేపలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చేపలతో కూరలనే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చేపలతో రుచిగా, సులువుగా, నిల్వ ఉండేలా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల నిల్వ పచ్చడి తయారీ విధానం..
చేపలు – అర కిలో, నూనె – ఒక కప్పు, ఎండుమిర్చి – 2, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.

చేపల నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా చేపలను శుబ్రంగా కడగాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం వేసి మరలా బాగా కడగాలి. తరువాత కళాయిలో ఒక కప్పు నూనెను వేసి వేడి చేయాలి. నూనె అవసరమయ్యే కొద్ది మరలా నూనెను వేసుకుంటూ ఉండాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నూనెను చల్లగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. నూనె చల్లారిన తరువాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత వేయించిన చేప ముక్కలను వేసి కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో లేదా స్లాస్టిక్ డబ్బాలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఒక రోజు తరువాత ఈ పచ్చడిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపల నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేపలతో పచ్చడిని తయారు చేసుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.