Gurivinda Ginjalu : గురివింద గింజలు.. వీటిని మనలో చాలా మంది చూసే ఉంటారు. పై భాగం ఎరుపు రంగులో కింది భాగం నలుపు రంగులో ఉండి ఈ గింజలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజలు మనకు గురివింద తీగమొక్క నుండి లభిస్తాయి. గురి వింద గింజల తీగ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. గురివింద గింజల తీగ మొక్కను ఔషధంగా ఉపయోగించినప్పటికీ గురివింద గింజలను మాత్రం ఔషధంగా ఉపయోగించరు. చూడడానికి అందంగా, గట్టిగా ఉండే ఈ గింజలు ప్రమాదకరమైనవని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలను ఈ గింజలకు దూరంగా ఉంచాలి. పొరపాటున ఈ గింజలను లోపలికి తీసుకుంటే మొదటగా కడుపు ఉబ్బరం సమస్య తలెత్తి అది నెమ్మదిగా విరేచనాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా నాడీ మండల వ్యవస్థ కూడా ప్రభావితం అయి చలనాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ గురివింద గింజలను కనుక ఎక్కువ మోతాదులో లోపలికి తీసుకున్నట్టయితే మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ గురివింద గింజలను కొన్ని ప్రాంతాలలో పూజల్లో కూడా ఉపయోగిస్తారు. వీటిని దారానికి గుచ్చుకుని మెడలో, చేతికి ధరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ దుష్ట శక్తి మన దరి చేరకుండా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ గురివింద గింజలను ఎట్టి పరిస్థితులల్లో లోపలికి తీసుకోకూడదు. మనకు తెల్ల గురివింద గింజలు కూడా దొరుకుతాయి. అవి కూడా ప్రమాదకరమైనవేనని నిపుణులు చెబుతున్నారు. ఈ గురివింద గింజలను ఇంట్లో పెట్టుకున్న వారు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు ఎట్టి పరిస్థితులల్లోనూ వాటిని ఇవ్వకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.