Guntagalagara : ఆయుర్వేదంలో కేశ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో గుంటగలగరాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. కానీ ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక దీనిని ఎలా ఉపయోగించాలో తెలియక మనం పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం. కానీ ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణతోపాటు ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా గుంటగలగరాకును ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిని సంస్కృతంలో భృంగరాజ్ అని అంటారు. ఈ మొక్క తేమ ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. గుంటగలగరాకు మొక్క మనకు పసుపు, తెలుపు, నలుపు రంగుల్లో దొరుకుతుంది.
నలుపు రంగు గుంటగలగరాకు మొక్క మనకు ఎక్కువగా దొరకదు. ఈ మూడింటిల్లో కూడా పసుపు రంగు పూలు పూసే గుంటగలగరాకు మొక్క ఎంతో శ్రేష్టమైనది. ఈ మొక్క కారం, చేదు రుచులను కలిగి ఉంటుంది. వాత, కఫ సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఈ మొక్క మనకు ఎంతో సహాయపడుతుంది. మనకు వచ్చే చర్మ సంబంధిత సమస్యలను, కంటి సమస్యలను, జుట్టు సమస్యలను ఈ గుంటగలగరాకు మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. కొన్నిరకాల ఆకు కూరలు కంటికి హాని చేస్తాయని అంటుంటారు. కానీ పొన్నగంటి కూర తరువాత కళ్లకు మేలు చేసే ఆకు కూరల్లో గుంటగలగరాకు మొక్క కూడా ఒకటి.
ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కంటికి చలువ చేసి కంటి చూపు మెరుగుపడుతుంది. గుంటగలగరాకు మొక్క ఆకుల రసంతో చేసిన కాటుకను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. కామెర్లను, సుఖ రోగాలను, గుండె సంబంధిత సమస్యలను గుంటగలగరాకు మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. ఈ మొక్క ఆకుల రసాన్ని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల పాము కాటుకు ప్రథమ చికిత్సలా పని చేస్తుంది. 8 చుక్కల తేనెలో 2 చుక్కల గుంటగలగరాకు రసాన్ని వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పురిట బిడ్డల జలుబు రోగాలను నయం చేయడంలో వాడవచ్చు.
కడుపులో నులి పురుగులు ఉన్నప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని ఆముదంతో కలిపి తీసుకోవడం వల్ల నులి పురుగులు నశిస్తాయి. చెవి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని రెండు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గుంటగలగరాకు మొక్క ఆకులను ముద్దగా నూరి తేలు కాటుకు గురి అయిన చోట ఉంచడం వల్ల తేలు విషం హరించుకుపోతుంది. గుంటగలగరాకు మొక్క ఆకులతో కూరను కానీ, పచ్చడిని కానీ చేసుకుని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తరచూ కూరగా చేసుకుని తినడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా గుంటగలగరాకు మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.