Guthi Vankaya Curry : మనకు ఫంక్షన్ లల్లో వండించే వంటకాల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఫంక్షన్ లల్లో చేసే ఈ గుత్తి వంకాయ కర్రీ చిక్కటి గ్రేవీతో, కలర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – 300 గ్రా., నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం- 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు లేదా తగినన్ని, చింతపండు రసం – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – పావు కప్పు, ఎండుకొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 4, దాల్చిన చెక్క ముక్కలు – 2, జీడిపప్పు – 5.
గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పేస్ట్ కోసం పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. వీటిని చక్కగా వేయించి జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత వంకాయలను 4 పచ్చాలుగా కట్ చేసుకుని నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో అర కప్పు నూనె వేసి వేడి చేయాలి. తరువాత వంకాయలను నూనెలో వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత నీళ్లు, చింతపండు పులుసు వేసి కలపాలి. మసాలా ఉడుకుపట్టిన తరువాత వేయించిన వంకాయలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. వంకాయలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, జీరా రైస్, బగారా అన్నం వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.