Bellam Tea : మనలో చాలా మంది టీని ఇష్టంగా తాగుతారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టీని తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. మనం టీ తయారీలో సాధారణంగా పంచదారను వాడుతూ ఉంటాము. పంచదార వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందన సంగతి మనకు తెలిసిందే. కనుక పంచదారకు బదులుగా ఈ మధ్య కాలంలో చాలా మంది బెల్లాన్ని వాడుతున్నారు. బెల్లంతో చేసే టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బెల్లం వేసి చేయడం వల్ల పాలు విరిగిపోతాయని చాలా మంది బెల్లం వేయడానికి సందేహిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పాలు విరగకుండా బెల్లం వేసి టీని తయారు చేసుకోవచ్చు. పాలు విరగకుండా బెల్లం వేసి టీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, టీ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, ఎండిన నాటు గులాబీ రేకులు – 5, బెల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పాలు – ఒకటిన్నర గ్లాస్, దంచిన యాలకులు – 3, దంచిన అల్లం – ఒక ఇంచు ముక్క.
బెల్లం టీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని వేసుకుని వేడి చేయాలి. ఇందులోనే యాలకులు, అల్లం వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత టీ పౌడర్, బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగే లోపు మరో గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత మంటను చిన్నగా చేసి పాలను మరిగిస్తూ ఉండాలి. డికాషన్ లో వేసిన బెల్లం కరిగిన తరువాత ఇందులో మరుగుతున్న పాలు పోసి కలపాలి. ఇందులోనే గులాబి రేకులు కూడా వేసి కలపాలి. ఈ టీని మధ్యస్థ మంటపై కలుపుతూ 2 నుండి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత టీని వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.