Gutti Capsicum Masala Curry : గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gutti Capsicum Masala Curry : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాప్సికాన్ని వివిధ ర‌కాల వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యాప్సికం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఒక్క‌సారి దీనిని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే ఈ గుత్తి క్యాప్సికం క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Gutti Capsicum Masala Curry recipe in telugu make like this
Gutti Capsicum Masala Curry

గుత్తి క్యాప్సికం మ‌సాలా కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా ఉండే క్యాప్సికం – పావు కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – చిటికెడు, నీళ్లు – త‌గిన‌న్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పల్లీలు – 2 టీ స్పూన్స్, నువ్వులు – రెండు టీ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టీ స్పూన్, చింత‌పండు – ఒక రెమ్మ‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, యాలకులు – 2, దాల్చిన చెక్క ముక్క – ఒక ఇంచు ముక్క‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ల‌వంగాలు – 4, కొత్తిమీర – గుప్పెడు.

గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

దీని కోసం ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి దోర‌గా వేగిన త‌రువాత నువ్వులు, ధ‌నియాలు, ఎండు కొబ్బ‌రి వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే మ‌సాలా పేస్ట్ కు మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం క‌ట్ కాకుండా తొడిమెల‌ను నెమ్మ‌దిగా తొల‌గించాలి. త‌రువాత ఇందులో ఒక్కో స్పూన్ మ‌సాలా పేస్ట్ ను స్ట‌ఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత స్ట‌ఫ్ చేసుకున్న క్యాప్సికం వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత క్యాప్సికంను మ‌రో వైపుకు తిప్పుకుని మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మిగిలిన మ‌సాలా పేస్ట్ ను, అలాగే త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి క్యాప్సికం క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు చ‌పాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో కూడా ఈ కూర‌ను తిన‌వ‌చ్చు. ఈ గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts