Gutti Vankaya Biryani : బిర్యానీ.. దీనిని ఇష్టపడిన వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు వివిధ రకాల బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇలా అనేక రుచుల్లో మనం ఈ బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవే కాకుండా మనం మరో రుచికరమైన బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ బిర్యానీలకు ఏ మాత్రం తీసి పోదు ఈ బిర్యానీ. అది మరేమిటో కాదు గుత్తి వంకాయ బిర్యానీ. గుత్తి వంకాయలతో మనం ఎక్కువగా కూరలను తయారు చేస్తూ ఉంటాం. కూరలే కాకుండా మనం గుత్తి వంకాయలతో బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కమ్మగా ఉండే ఈ గుత్తి వంకాయ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – అర కిలో, గుత్తి వంకాయలు – అర కిలో, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, పల్లీలు – అర కప్పు, నువ్వులు – 2 టీ స్పూన్స్, యాలకులు – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్స్, పెరుగు – అర కప్పు, నిమ్మరసం – ఒక రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 4, నెయ్యి – 2 టీ స్పూన్స్, పుదీనా తరుగు – 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు.
గుత్తి వంకాయ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నువ్వులు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, వేయించిన పల్లీలు, నువ్వులు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, పసుపు, ఉప్పు, నిమ్మరసం, కారం వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు వంకాయలకు రెండు గాట్లు పెట్టుకుని అందులో ఈ మసాలా పేస్ట్ ను తగినంత ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించిన తరువాత వంకాయలు వేసి మూత పెట్టాలి. వీటిని పది నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి.ఇందులోనే ఉప్పు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, యాలకులు, సాజీరా, నిమ్మరసం వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని ముప్పావు వంతు ఉడికించిన తరువాత నీటిని వడకట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని ముందుగా తయారు చేసుకున్న వంకాయ మిశ్రమంపై సమానంగా వేసుకోవాలి. తరువాత దీనిపై నెయ్యి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి.
తరువాత దీనిపై సిల్వర్ పాయిల్ ఉంచి మూత పెట్టి చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆప్ చేసుకోవాలి. తరువాత దీనిని మరో 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ బిర్యానీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.