Halva Puri : హల్వా పూరీ.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంటకాన్ని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చూడడానికి పూరీల లాగా ఉన్నప్పటికి వీటి రుచి మాత్రం తియ్యగా ఉంటుంది. తీపి రుచిని ఇష్టపడే వారు ఈ వంటకాన్ని మరింత ఇష్టంగా తింటారు. ఈ హల్వా పూరీలను తయారు చేయడం చాలా సులభం. అలాగే వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హల్వా పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 2 కప్పులు, ఉప్పు – చిటికెడు, బొంబాయి రవ్వ – ఒక టీ గ్లాస్, పంచదార – ఒకటింపావు టీ గ్లాసులు, నీళ్లు – రెండున్నర టీ గ్లాసులు, నెయ్యి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

హల్వా పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, పంచదార వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ, పంచదార వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం మరీ గట్టిగా ఉండకుండ చూసుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనె రాసుకుంటూ రవ్వ మిశ్రమాన్ని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరలా కలుపుకోవాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ కొద్దిగా మైదా పిండిని తీసుకుని చేత్తో చెక్క అప్పలాగా వత్తుకోవాలి.
తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న రవ్వ ఉండలను ఉంచి అంచులతో మూసి వేసుకోవాలి. ఇప్పుడు అరటి ఆకును లేదా ప్లాస్టిక్ కవర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి. దీనిపై మైదా పిండి మరియు రవ్వ ముద్దను ఉంచి చేత్తో పూరీలా వత్తుకోవాలి. ఇలా చేత్తో వత్తుకోవడం రాని వారు చపాతీ కర్రతో కూడా పూరీలా వత్తుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వత్తుకున్న పూరీని వేసి గంటెతో నూనెలోకి వత్తాలి. ఇలా చేయడం వల్ల పూరీ పొంగుతుంది. తరువాత దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హల్వా పూరీ తయారవుతుంది. ఈ పూరీలు రెండు నుండి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు, పండుగులకు ఇలా హల్వా పూరీలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.