Hariyali Chicken : మనకు పంజాబీ ధాబాలల్లో లభించే చికెన్ వెరైటీలల్లో హర్యాలీ చికెన్ ఒకటి. ఈ చికెన్ కర్రీ చాలారుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కర్రీని అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకంచికెన్ కర్రీ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. వెరైటీ రుచులు కావాలనుకునే వారు ఈ విధంగా హర్యాలీ చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. ధాబా స్టైల్ హర్యాలీ చికెన్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర – 3 నుండి 4 కట్టలు, పచ్చిమిర్చి – 6, పుదీనా -ఒక పెద్ద కట్ట, కొత్తిమీర – ఒక పెద్ద కట్ట, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మరసంలో గంట పాటు నానబెట్టిన చికెన్ – అరకిలో, కసూరి మెంతి -ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, టమాటాలు – 4, నీళ్లు – 100 ఎమ్ ఎల్,బటర్ – ఒక టీ స్పూన్, క్రీమ్ – ఒక టీ స్పూన్.
ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాలకూర తరుగు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ పాలకూరను చల్లటి నీటిలో వేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నీళ్లల్లో వేసిన పాలకూర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కసూరిమెంతి వేసి కలపాలి.
దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత బటర్, క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హర్యాలీ చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, నాన్ దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.