Capsicum Bajji : క్యాప్సికం బ‌జ్జీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే రుచిగా ఉంటాయి..

Capsicum Bajji : వ‌ర్షం ప‌డుతుంటే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే.. వేడి వేడిగా మిర్చి బ‌జ్జీల‌ను తినాల‌ని అనిపిస్తుంది. అయితే మిర్చి బ‌జ్జీలు సాధార‌ణంగా మ‌న‌కు ఎక్క‌డైనా ల‌భిస్తాయి. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. కానీ క్యాప్సికంతోనూ బ‌జ్జీల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. పైగా ఇవి మిర్చి బ‌జ్జీల‌లా కారం ఉండ‌వు. కానీ రుచిగా ఉంటాయి. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో క్యాప్సికంతోనూ బ‌జ్జీల‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇక వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం బ‌జ్జీల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాప్సికం – 2, శ‌న‌గ‌పిండి – ముప్పావు క‌ప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వాము – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, నీళ్లు – అర క‌ప్పు లేదా త‌గిన‌న్ని, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా, చిన్న‌గా త‌ర‌గిన ఉల్లిపాయ‌లు – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనెలో వేయించిన ప‌ల్లీలు -3 టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – 2 టేబుల్ స్పూన్లు.

have you tasted Capsicum Bajji before here how to make them
Capsicum Bajji

క్యాప్సికం బ‌జ్జీల‌ త‌యారీ విధానం..

ముందుగా క్యాప్సికంను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని తొడిమ‌ల‌తో స‌హా నాలుగు భాగాలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని, బియ్యం పిండిని, ఉప్పును, ప‌సుపును, కారాన్ని, ధ‌నియాల పొడిని, వామును, వంట‌సోడాను వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఒక టీ స్పూన్ వేడి చేసిన నూనెను కూడా వేసి క‌లుపుకోవాలి. త‌రువాత నీళ్ల‌ను కొద్ది కొద్దిగా పోసుకుంటూ దోశ పిండిలా క‌లుపుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె వేడ‌య్యాక క్యాప్సికం ముక్క‌ల‌ను తీసి శ‌న‌గ పిండి మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేయాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ‌జ్జీల‌ను కాల్చుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లను, కొత్తిమీర‌ను, నిమ్మ ర‌సాన్ని, వేయించిన ప‌ల్లీలను, చిటికెడు ఉప్పును, కారాన్ని వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు బ‌జ్జీల‌ను మ‌ధ్య‌లోకి క‌త్తితో కోసి వాటిలో ముందుగా క‌లిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క‌ల మిశ్ర‌మాన్ని ఉంచాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం బ‌జ్జీలు త‌యార‌వుతాయి. బ‌జ్జీల‌ను నూనెలో కాల్చుకునేట‌ప్పుడు నూనెను మ‌రీ ఎక్కువ‌గా వేడి చేయ‌కూడ‌దు. ఇలా క‌లుపుకున్న శ‌న‌గ‌పిండి మిశ్ర‌మంతో బంగాళాదుంప‌, అర‌టికాయ‌, వంకాయ, కోడిగుడ్డు వంటి బ‌జ్జీల‌ను కూడా వేసుకోవ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో లేదా వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు ఈ విధంగా చ‌క్క‌గా బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని తింటూ వ‌ర్షాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

D

Recent Posts