Atukula Payasam : మనం ఆహారంలో భాగంగా అటుకులను కూడా అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటాం. అటుకులలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అటుకలతో మనం పోహాను, అటుకుల మిక్చర్ ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా అటుకులతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అటుకులతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పోహా అటుకులు – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – రెండున్నర కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – కొద్దిగా, ఎండుద్రాక్ష – కొద్దిగా, పంచదార – పావు కప్పు లేదా తగినంత, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
అటుకుల పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత జీడిపప్పును, ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో అటుకులను వేసి చిన్న మంటపై 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తతరువాత పాలను పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత పంచదారను కూడా వేసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి.
ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఇందులో యాలకుల పొడిని, వేయించిన డ్రైఫ్రూట్స్ ను కూడా వేసి కుపుకోవాలి. పాయసం చల్లారే కొద్ది గట్టిగా తయారవుతుంది. కనుక పాయసం కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అటుకులతో ఇలా పాయసాన్ని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.