Chicken Garelu : చికెన్ అంటే సహజంగానే చాలా మంది మాంసాహార ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకనే దాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేయవచ్చు. ఇవి స్నాక్స్ రూపంలో భలే రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా సులభమే. చికెన్ గారెలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – 200 గ్రాములు, జీడిపప్పు – 100 గ్రాములు, శనగపిండి – 200 గ్రాములు, బియ్యం పిండి – 50 గ్రాములు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీస్పూన్, పుదీనా – చిన్న కట్ట, కొత్తిమీర – అరకట్ట, ఉప్పు, నూనె – తగినంత.
చికెన్ గారెలను తయారు చేసే విధానం..
చికెన్‌ను బాగా కడగాలి. ఆ తర్వాత కీమాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. జీడిపప్పును పేస్ట్‌లా చేసుకోవాలి. చికెన్ కీమాలో జీడిపప్పు పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, శనగపిండి, బియ్యం పిండి కొంచెం నీరు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. ఈలోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. చికెన్ మిశ్రమాన్ని చిన్న గారెల్లా చేసి నూనెలో వేసి వేయించుకోవాలి. రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు గారెలను కాల్చుకోవాలి. తరువాత కళాయి నుంచి తీయాలి. దీంతో ఎంతో రుచికరమైన చికెన్ గారెలు రెడీ అవుతాయి. వీటిని అలాగే తినేయొచ్చు. లేదా ఏదైనా చట్నీతో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.