Chintha Chiguru Pachadi : ఎంతో రుచిగా ఉండే చింత చిగురు ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Chintha Chiguru Pachadi : మ‌నం పులుసు కూర‌లు, సాంబార్, ర‌సం వంటి వాటి త‌యారీలో చింత‌పండును ఉప‌యోగిస్తూ ఉంటాం. చింత‌పండునే కాకుండా మ‌నం చింత చిగురును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చింత‌చిగురు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో చింత చిగురు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చింత‌చిగురును వివిధ ర‌కాల వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా చింత చిగురుతో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత చిగురుతో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. చింత చిగురుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చింత చిగురు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చింత చిగురు – రెండు క‌ప్పులు, నూనె – 2 టీ స్పూన్స్, ఎండు మిర‌ప‌కాయ‌లు – 6 లేదా త‌గిన‌న్ని, ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నీళ్లు – 30 ఎంఎల్ లేదా త‌గిన‌న్ని.

here it is how to make Chintha Chiguru Pachadi
Chintha Chiguru Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, శ‌న‌గ ప‌ప్పు – అర టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 1 లేదా 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌.

చింత చిగురు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనెను వేసి నూనె కాగిన త‌రువాత చింత‌చిగురును వేసి చిన్న మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత ఎండు మిర్చిని, ప‌ల్లీల‌ను వేసి బాగా వేయించి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే త‌గినంత ఉప్పును, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ముందుగా వేయించిపెట్టుకున్న చింత చిగురును వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి పేస్ట్ లా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకుని ప‌చ్చ‌డిలో వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చింత చిగురు ప‌చ్చ‌డి త‌యారవుతుంది. దీనిని తాళింపు వేసుకోకుండా కూడా తిన‌వ‌చ్చు. వేడి వేడి అన్నంలో చింత చిగురు ప‌చ్చ‌డిని, నెయ్యిని వేసుకుని క‌లిపి తింటే చాలా రుచిగా ఉండ‌డంతోపాటు చింత‌చిగురును తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts