Black Thread Anklet : చాలా మంది కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. సాధారణ ప్రజలతోపాటు సెలెబ్రిటీలు కూడా ఇలా నల్ల దారాన్ని కట్టుకోవడం సర్వ సాధారణమైపోయింది. కాళ్లకు ఇలా నల్లదారాన్ని కట్టుకోవడం ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ గా మారింది. ప్రస్తుతం మనకు మార్కెట్ లో వివిధ డిజైన్ లలో ఈ నల్ల దారాలు లభిస్తున్నాయి. అసలు కాళ్లకు నల్ల దారాన్ని ఎందుకు కడతారు.. ఏ కాలుకు నల్ల తాడును కట్టాలి.. ఈ నల్ల తాడును ఎలా కట్టుకోవాలి.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన కంటి చూపుకు ఎంతో శక్తి ఉంటుంది. మన కంటి చూపుకు పాజిటివ్ శక్తి, అదే విధగా నెగెటివ్ శక్తి కూడా ఉంటాయి. వ్యక్తి స్వభావాన్ని బట్టి ఆ శక్తి బయటకు వస్తుంది. ప్రతి మనిషి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఎదుటి వారి కంటి నుండి వచ్చే శక్తి ఆ అయస్కాంత క్షేత్రాన్ని చేధించుకుని మనపై పడినప్పుడు దాని ప్రభావం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనినే దిష్టి తగలడం అంటారు. ఇలా ఎదుటి వ్యక్తి నుండి నెగెటివ్ ఎనర్జీ మన మీద పడినప్పుడు ఆవలింతలు, తలనొప్పి, బద్దకం, వాంతులు అవ్వడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇలా ఎదుటి వారి దిష్టి నేరుగా మన మీద పడకుండా ఉండాలని మన పెద్దలు ఇలా కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవడం అలవాటు చేశారు. నలుపుకు దృష్టిని ఆకర్షించే శక్తి ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకు బుగ్గ మీద, నుదుటి మీద, అరి కాలులో నల్ల చుక్కలు పెడుతుంటారు. అందరూ నల్ల బొట్టు పెట్టుకోలేరు. కనుక కాళ్లకు నల్లదారం కట్టుకోవడాన్ని మన పెద్దలు మనకు అలవాటు చేశారు. కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల ఎదుటి వారి నుండి వచ్చే నెగెటివ్ ఎనర్జీని ఆ నల్ల దారం గ్రహిస్తుంది. దీంతో మనకు దిష్టి తగలకుండా ఉంటుంది.
ఈ నల్ల దారాన్ని పురుషులు కుడి కాలుకు, స్త్రీలు ఎడమ కాలుకు కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా ఎక్కువగా దిష్టి తగిలే వారు నల్ల దారాన్ని అమావాస్య తరువాత వచ్చే మొదటి మంగళవారం నాడు కట్టుకోవాలి. ఇలా కాళ్లకు నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.