Minapa Garelu : మిన‌ప‌గారెల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Minapa Garelu : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ మిన‌ప‌ప‌ప్పుతో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప‌గారెలు ఎంత రుచిగా ఉంటాయో మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా గారెల‌ను క‌ర‌క‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ మిన‌ప గారెల‌ను బ‌యట దొరికే విధంగా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

here it is how you can make Minapa Garelu crunchy
Minapa Garelu

మిన‌ప‌గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప ప‌ప్పు – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), చిన్న‌గా త‌రిగిన కొత్తిమీర – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – చిటికెడు, నీళ్లు – ఒకటి లేదా ఒక‌టిన్న‌ర టీ గ్లాస్, నూనె – డీప్‌ ప్రై కి స‌రిప‌డా.

మిన‌ప గారెల త‌యారీ విధానం..
ముందుగా మిన‌ప ప‌ప్పును ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ మిన‌ప ప‌ప్పును జార్ లో లేదా గ్రైండ‌ర్ లో వేసి నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా ప‌ట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగే వ‌ర‌కు ఉంచాలి. నూనె కాగిన త‌రువాత చేతికి నీటితో త‌డి చేసుకుంటూ కావ‌ల్సిన ప‌రిమాణంలో పిండిని తీసుకుని గారెల్లా వ‌త్తుకుని నూనెలో వేయాలి లేదా పాలిథీన్ క‌వ‌ర్ కు నీటితో త‌డి చేసి దానిపై పిండిని ఉంచి గారెల్లా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి.

ఈ గారెల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిన‌ప ప‌ప్పు గారెలు త‌యార‌వుతాయి. వీటిని ఉద‌యం అల్పాహారంగా లేదా సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు. ఈ గారెల‌ను ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల గారెలు క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఎక్కువ నూనెను పీల్చుకోకుండా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts