Mysore Bonda : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. మైసూర్ బోండాలు మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటిని ఇంట్లో కూడా చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. మైసూర్ బోండాలు బాగా పొంగి, మెత్తగా, రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 2 కప్పులు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – 2 కప్పులు, పచ్చి మిర్చి – 2, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – కొద్దిగా, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, వంటసోడా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మైసూర్ బోండా తయారీ విధానం..
ముందుగా పచ్చి మిర్చిని, అల్లం ముక్కలను కలిపి కచ్చా పచ్చగా దంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదా పిండిని, పెరుగును, బియ్యం పిండిని, కచ్చా పచ్చాగా దంచిన అల్లం, పచ్చి మిర్చిని, జీలకర్రను, కరివేపాకును, ఉప్పును, వంటసోడాను వేసి తగినన్ని నీళ్లను పోస్తూ మరీ పలుచగా కాకుండా పిండిని కలుపుకుని మూత పెట్టి అర గంట పాటు కదిలించకుండా ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె సోసి నూనె కాగిన తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి చేతికి తడి చేసుకుంటూ బోండాలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ బోండాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ ఇలా మైసూర్ బోండాలను తయారు చేసుకుని తినవచ్చు.