High Protein Dosa : సాధారణంగా దోశలను తయారు చేయడానికి మినపప్పును వాడుతూ ఉంటాము. మినపప్పుతో చేసే దోశలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవలం మినపప్పునే కాకుండా రుచిగా ఇతర పప్పులతో కూడా మనం దోశలను తయారు చేసుకోవచ్చు. పప్పులన్నీ కలిపి చేసే ప్రోటీన్ దోశలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈదోశలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే హై ప్రోటీన్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హై ప్రోటీన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ముప్పావు కప్పు, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పెసర్లు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 4, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, సన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ.
హై ప్రోటీన్ దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసర్లు, ఎండుమిర్చి వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. పప్పు దినుసులన్నీ నానిన తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి ఉల్లిపాయతో రుద్దాలి. తరువాత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తరువాత మరోవైపుకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హైప్రోటీన్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా దోశను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.