Honey Chilli Potato Fries : ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..!

Honey Chilli Potato Fries : హనీ చిల్లీ పొటాటో ప్రైస్.. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ ఫ్రైస్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. కిట్టీ పార్టీస్ అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫంక్ష‌న్స్ జ‌రిగిన‌ప్పుడు ఇలా ఆలూ ఫ్రైస్ ను త‌యారు చేసి స‌ర్వ్ చేయ‌వ‌చ్చు. ఈ పొటాటో ఫ్రైస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ హ‌నీ చిల్లీ పొటాటో ఫ్రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హనీ చిల్లీ పొటాటో ప్రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 300 గ్రా., కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, షెజ్వాన్ సాస్ – 2 టేబుల్ స్పూన్స్, న‌ల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, లైట్ సోయా సాస్ – అర టీ స్పూన్, నీళ్లు – 100 ఎమ్ ఎల్, తేనె – 2 టేబుల్ స్పూన్స్.

Honey Chilli Potato Fries recipe in telugu very tasty
Honey Chilli Potato Fries

హనీ చిల్లీ పొటాటో ప్రైస్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌ను వెజీస్ గా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ఉప్పు వేసిన నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించి వ‌డ‌క‌ట్టాలి. త‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని చ‌ల్లుకుని పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి.

త‌రువాత ఉల్లిపాయ త‌రుగు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత షెజ్వాన్ సాస్, మిరియాల పొడి, ఉప్పు, తెల్ల మిరియాల పొడి, సోయా సాస్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు ఉడుకుప‌ట్టిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు ఉడికించి తేనె వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హ‌నీ చిల్లీ పొటాటో ఫ్రైస్ త‌యార‌వుతాయి. పిల్ల‌లు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts