Hotel Style Kaju Chicken Curry : చికెన్ తో మనం రకరకాల వంటలను తయారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాము. చికెన్ తో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చికెన్ కూర రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఎలా వండిన కూడా చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్ లో జీడిపప్పు వేసి ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండున్నర టీ స్పూన్స్, పసుపు – ముప్పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), తరిగిన పచ్చిమిర్చి – 3, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – 4, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 5, ధనియాలు – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీడిప్పు – 4 టేబుల్ స్పూన్స్.
రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అర టీ స్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ నూనె వేసి చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత ఒక జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సాజీరా వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ను వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిపై ప్లేట్ ను ఉంచి అందులో నీళ్లు పోసి చికెన్ ను ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకోవడం వల్ల ఆవిరి బయటకు పోకుండా చికెన్ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. చికెన్ ను మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, సంగటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీని ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఈ విధంగా చికెన్ కర్రీ తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు పోషకాలను కూడా పొందవచ్చు.