Hotel Style Minapa Garelu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ మినపగారెలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. మినపగారెలు చాలా రుచిగా ఉంటాయి. మనకు హోటల్స్ లో కూడా ఈ మినపగారెలు లభిస్తూ ఉంటాయి. హోటల్స్ లో చేసే ఈ మినపగారెలు చూడడానికి చక్కగా చాలా రుచిగా ఉంటాయి. ఇలాంటి మినపగారెలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ లో మినప గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ మినప గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – 500 గ్రా., ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
హోటల్ స్టైల్ మినప గారెల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపగుళ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక మినపగుళ్లను జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఉప్పును కూడా వేసి కొద్ది కొద్దిగా నీటిని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ గారెల పిండి మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత ఒక ప్లాస్టిక్ పేపర్ మీద లేదా గంటె మీద కొద్దిగా తడి చేసి తగినంత పిండిని తీసుకుని గారె ఆకారంలో వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ గారెలను నూనెలో వేసిన వెంటనే కదపకూడదు. అలాగే పక్క పక్కనే వేయకూడదు.
ఈ గారెలను మధ్యస్థం కంటే కొద్దిగా ఎక్కువ మంట మీద రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల హోటల్ స్టైల్ మినపగారెలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. మినపగుళ్లను 4 గంటల కంటే ఎక్కువగా నానబెట్టడం వల్ల అవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. అలాగే పిండి పలుచగా కూడా ఉండకూడదు. ఈ చిట్కాలను పాటిస్తూ చేయడం వల్ల చక్కగా, రుచిగా ఉండే గారెలు తయారవుతాయి. అప్పుడప్పుడూ ఇలా మినపప్పుతో ఎంతో రుచిగా ఉండే గారెలను తయారు చేసుకుని తినవచ్చు.