Beerakaya Egg Curry : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. బీరకాయల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించి అధిక బరువు సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. కనుక బీరకాయలను తరచూ తీసుకోవాలి. అయితే చాలా మంది బీరకాయలతో కూర, పప్పు, పచ్చడి వంటివి చేస్తుంటారు. కానీ వాటితో కోడిగుడ్లను కలిపి కూడా వండుకోవచ్చు. ఇలా చేసే కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ కోడిగుడ్డు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడకబెట్టిన కోడిగుడ్లు – 2, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు తరిగినవి, లేత బీరకాయ ముక్కలు – ఒక కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చి మిర్చి – 3, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – 1 టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, గరం మసాలా పొడి – అర టీస్పూన్, నూనె – తగినంత.
బీరకాయ కోడిగుడ్డు కూరను తయారు చేసే విధానం..
ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి వాటిపైన కత్తితో గాట్లు పెట్టండి. ఓ గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసి వేడి చేయండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లను అందులో వేసి కాసేపు వేయించండి. ఉడకబెట్టిన గుడ్లను తీసి పక్కన పెట్టండి. ఆ మిశ్రమంలో బీరకాయ ముక్కలు వేసి ముతపెట్టండి. కాసేపటి తర్వాత ఉప్పు, పసుపు వేయండి. బీరకాయ ముక్కలు ఉడికేదాకా అలాగే ఉంచండి. ఒకవేళ బీరకాయ ముక్కలు ఉడకకపోతే కొన్ని నీళ్లు పోయండి. ఇందులో వేయించిన గుడ్లు, కారం, మసాలాలు వేసి బాగా కలపండి. కాసేపు అలాగే సన్నని మంట మీద ఉడికించండి. అంతే.. వేడి వేడి బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ. దీన్ని అన్నం లేదా చపాతీల్లో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.