Grapes Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటిని నేరుగా తినడంతో పాటు ద్రాక్ష పండ్లతో మనం ఎంతో రుచిగా జ్యూస్ ను కూడా తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. ద్రాక్ష పండ్ల జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం రుచితో పాటు వేసవి కాలంలో ఉండే వేడి నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. ఈ జ్యూస్ ను భిన్నంగా మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్ల జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల ద్రాక్ష పండ్లు – 3 గుత్తులు, నీళ్లు – 3 గ్లాసులు, పంచదార – రెండు టీ గ్లాసులు, ద్రాక్ష ఎసెన్స్ – ఒక టీ స్పూన్, నిమ్మ ఉప్పు – చిటికెడు.
ద్రాక్ష పండ్ల జ్యూస్ తయారీ విధానం..
ముందుగా ద్రాక్ష పండ్లను శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని గోరు వెచ్చని నీటిలో వేసి ఉంచాలి. గోరువెచ్చని నీటిలో వేయడం వల్ల ద్రాక్ష పండ్లపై ఉండే పొట్టు సులభంగా వస్తుంది. ఇప్పుడు ద్రాక్ష పండ్లపై ఉండే పొట్టు, వాటిలో ఉండే గింజలు తీసేసి వాటి లోపల ఉండే గుజ్జును నీటిలో వేసి అలాగే ఉంచాలి. తరువాత మరో గిన్నెలో పంచదార, ఒకటిన్నర టీ గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదారను గులాబ్ జామున్ పాకం వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పంచదార పాకాన్ని ముందుగా తయారు చేసుకున్న ద్రాక్ష పండ్ల రసంలో వేసి కలపాలి. తరువాత ఇందులో ద్రాక్ష ఎసెన్స్, నిమ్మ ఉప్పు వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ద్రాక్ష పండ్ల జ్యూస్ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత తాగవచ్చు లేదా ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగవచ్చు. ఈ విధంగా ద్రాక్ష పండ్ల జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు వేసవి నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు.