టమాటాలతో నిత్యం మనం అనేక కూరలను, వంటకాలను చేసుకుంటుంటాం. దాదాపుగా మనం వండుకునే ప్రతి కూరలోనూ ఒకటో, రెండో టమాటాలను వేయకపోతే కూర రుచిగా అనిపించదు. ఇక చికెన్, మటన్ వండితే టమాటాలను రుచి కోసం తప్పనిసరిగా వేస్తారు. అయితే టమాటాలతో చేసుకునే కూరలతోపాటు వాటితో రైస్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. చక్కని టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు. మరి.. టమాటా రైస్ ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
టమాటా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు:
అల్లం (ముక్కలుగా కట్ చేసినవి) – 2, వెల్లుల్లి – 4 రెబ్బలు, జీడిపప్పు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క – 2 (చిన్న ముక్కలు), లవంగాలు – 6, టమాటాలు (సగానికి కట్ చేసినవి) – 3, నూనె – 3 టేబుల్ స్పూన్లు, స్టార్ సోపు – 2 రేకులు, కల్పాసి మసాలా దినుసు (నల్ల రాయి పువ్వు) – 1 స్పూన్, ఉల్లిపాయలు (ముక్కలుగా కట్ చేసినవి) – 1 కప్పు, పచ్చిమిర్చి (మధ్యకు కట్ చేసినవి) – 2, పుదీనా ఆకులు (సన్నగా తరిగినవి) – 1/4 కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, సాంబార్ పౌడర్ – 1 స్పూన్, రైస్ – 1/2 గిన్నె, నీరు – 1 గిన్నె.
టమాటా రైస్ తయారు చేసే విధానం:
కుక్కర్ లో బియ్యం తీసుకోవాలి. సరిపడా నీరు పోసి, ఉప్పు 2 టీస్పూన్లు వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లిని మిక్సీ పట్టుకోవాలి. అనంతరం జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, టమాటాలు అన్నింటినీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి 2 లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. స్టార్ సోంపు, కల్పాసి మసాలా దినుసులను, యాలకులు, ఉల్లిపాయ ముక్కలను, సన్నగా తరిగిన పచ్చి మిర్చిని, పుదీనా ఆకులను వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ వేయించాలి. అందులో ఉప్పు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. పాన్‌లో ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అలా 5 నిమిషాల పాటు వేయించాక, అందులో కొంచెం సాంబార్ పొడి కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వండిన అన్నం వేసి బాగా కలపాలి. అంతే.. టమాటా రైస్ రెడీ అవుతుంది.