Tomato Sauce : మనకు బయట మార్కెట్లో లభించే అనేక రకాల ఆహారాల్లో టమాటా సాస్ కూడా ఒకటి. దీన్ని మనం బేకరీ పదార్థాల్లో లేదా ఇతర తినుబండారాలు, ఆహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంతో వంటలు కూడా చేస్తుంటారు. మార్కెట్లో మనకు ప్యాకెట్లు, సీసాల్లో టమాటా సాస్ లభిస్తుంది. అయితే కాస్త శ్రమించాలే కానీ టమాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. టమాటా సాస్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా సాస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – రెండున్నర కిలోలు, ఎండు మిర్చి – 7, వెల్లుల్లి – 3, అల్లం – 2 ముక్కలు, ఎండు ద్రాక్ష – సగం కప్పు, వైట్ వెనిగర్ – సగం కప్పు, ఉప్పు – 1 టీస్పూన్, చక్కెర – 6 టీస్పూన్లు, సోడియం బెంజోయేట్ – ఒక టీస్పూన్ వేడి నీళ్లల్లో పావు స్పూన్ వేసి కలిపింది.
టమాటా సాస్‌ను తయారు చేసే విధానం..
టమాటాలను కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎండు మిర్చిని పొడవుగా కోసి పెట్టుకోవాలి. 5 లీటర్ల ప్రెజర్ కుక్కర్లో టమాటా ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి, మిర్చి, వెనిగర్, ఉప్పు, చక్కెర కలిపి సన్నని సెగ మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు మెత్తగవ్వగానే స్టవ్‌ను ఆఫ్ చేయాలి. బ్లెండర్తో టమాటా స్మూతీ చేయాలి. దీన్నంతా వడకట్టాలి. సన్నని సెగ మీద టమాటా గుజ్జునంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిస్తే టమాటా సాస్ రెడీ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడే సోడియం బెంజోయేట్ కలపాలి. చల్లారాక సీసాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేసిన సాస్ నెల రోజుల వరకు ఉంటుంది. అవసరం అయినంత మేర టమాటా సాస్‌ను ఎప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. దీంతో సాస్‌ను బయట కొనాల్సిన పనిలేదు. ఇలా చేసిన సాస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది.