Hyderabadi Style Double Ka Meetha : హైద‌రాబాద్ స్టైల్‌లో డ‌బుల్ కా మీఠాను ఇలా చేయొచ్చు.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Hyderabadi Style Double Ka Meetha : విందు భోజ‌నాల‌లో ఎక్కువ‌గా ఉండే తీపి ప‌దార్థాల‌లో డ‌బుల్ కా మీఠా కూడా ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. డ‌బుల్ కా మీఠాను మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా త‌యారు చేస్తారు. అందులో భాగంగా హైద‌రాబాద్ స్టైల్ డ‌బుల్ కా మీఠాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హైద‌రాబాద్ స్టైల్ డ‌బుల్ కా మీఠా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైస్ – 4, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్స్, చిక్క‌టి పాలు – అర లీట‌ర్, ప‌చ్చి కోవా – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, ఎల్లో ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, నీళ్లు – పావు క‌ప్పు.

Hyderabadi Style Double Ka Meetha make in this way
Hyderabadi Style Double Ka Meetha

హైద‌రాబాద్ స్టైల్ డ‌బుల్ కా మీఠా త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ ను తీసుకుని మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో రెండు లేదా మూడు ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక్కో టేబుట్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ బ్రెడ్ ముక్క‌ల‌ను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిని టిష్యూ పేప‌ర్ తో శుభ్ర‌ప‌రిచి అందులో పాల‌ను పోయాలి. ఈ పాల‌ను క‌లుపుతూ స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించుకోవాలి. పాలు మ‌రిగిన త‌రువాత ప‌చ్చి కోవాను, ఒక టేబుల్ స్పూన్ పంచ‌దారను వేసి బాగా క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి.

పంచ‌దార క‌రిగిన త‌రువాత యాల‌కుల పొడిని, ఫుడ్ క‌ల‌ర్ ను, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి మ‌రో 10 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఫుడ్ క‌ల‌ర్ కు బ‌దులుగా కుంకుమ పువ్వును కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో పంచ‌దార‌ను, నీళ్ల‌ను పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగి కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్క‌లను పంచ‌దార మిశ్ర‌మంలో వేసి అర నిమిషంలోనే వాటిని రెండు వైపులా తిప్పి ఒక ప్లేట్ లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి.

ఇలా అన్ని ముక్క‌ల‌ను పంచ‌దార మిశ్ర‌మంలో వేసి తీసిన త‌రువాత వాటిపై ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న పాల మిశ్ర‌మం వేయాలి. ఇలా వేసిన త‌రువాత వాటిపై మ‌రికొద్దిగా డ్రై ఫ్రూట్స్ ను చ‌ల్లుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాద్ స్టైల్ డ‌బుల్ కా మీఠా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలా సుల‌భంగా డ‌బుల్ కా మీఠాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts