Tomato Curry : ప్రతి ఒక్కరి వంటింట్లో కూరగాయలు ఉన్నా లేకున్నా టమాటాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. టమాటాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. టమాటాలతో వివిధ రకాల వంటలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. అలాగే కేవలం టమాటాలను ఉపయోగించి మనం టమాటా కూరను కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాటా కూర చాలా రుచిగా ఉంటుంది. టమాటా కూరను రుచిగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. రుచిగా టమాటాల కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 2, లవంగాలు -3, దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి), జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – పావు కిలో, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నువ్వుల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను, ఉప్పును, కారాన్ని, పసుపును, ధనియాల పొడిని వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నువ్వుల పొడిని వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కూర తయారవుతుంది. ఇంట్లో ఇతర కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటాలతో చాలా త్వరగా, చాలా రుచిగా టమాట కూర చేసుకుని తినవచ్చు. ఈ టమాట కూరను అన్నం, చపాతీ, ఉప్మా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.