Sparrow : కొన్ని సందర్భాలలో మన ఇంట్లోకి పక్షులు, పురుగులు వస్తుంటాయి. పక్షులు, పురుగులు ఇంట్లోకి రావడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఏయే పక్షులు, పురుగులు ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది. ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏవి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లోకి పిచుకలు వస్తే మంచిదని పెద్దలు చెబుతున్నారు. పిచ్చుకలు ఇంట్లోకి రావడాన్ని చాలా మంది శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లోకి పిచ్చుకలు రావడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
రెండు పిచుకలు గనక ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుందని లేదా సంతానం కలుగుతుందని పెద్దలు భావించే వారు. అలాగే కాకిని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ కాకి ఇంటికి వస్తే కూడా శుభం కలుగుతుంది. మన పితృ దేవతలు మనల్ని ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చారని భావించాలి. కానీ ఒకవేళ బయటకు వెళ్లేటప్పుడు కాకి తల మీద వాలిన లేదా తన్నిన ఏదో చెడు జరగడానికి సంకేతంగా భావించాలి. అదే విధంగా గుడ్లగూబను చూసి చాలా మంది భయపడుతుంటారు. చూడడానికి కూడా గుడ్లగూబ చాలా భయంకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదం. లక్ష్మీ దేవి ఇంటికి రాబోతుందని భావించాలి. గుడ్లగూబ లక్ష్మీ దేవి వాహనం. కనుక గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు.
ఇక పాములు కూడా అప్పుడప్పుడూ ఇంట్లోకి వస్తూ ఉంటాయి. పాము గనక ఇంట్లోకి వస్తే ఇంట్లోని వ్యక్తులకు మానసిక వ్యథ ఎక్కువ కాబోతుందని, అశాంతి కలగబోతుందని భావించాలి. పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదని చెబుతుంటారు. అలాగే కందిరీగలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావించాలి. కందిరీగలు ఇంట్లో కట్టిన గూడు మట్టిని బొట్టుగా పెట్టుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి.
అదే విధంగా అందరి ఇళ్లోనూ బల్లులు ఉంటాయి. బల్లులు లేని ఇల్లు ఉండనే ఉండదు. బల్లి ఇంట్లో ఉంటే మంచిదని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే కంటి మిడతలు, సీతాకోక చిలుకలు ఇంట్లోకి వచ్చినా కూడా శుభప్రదంగా భావించాలి. ఇవి ఇంట్లోకి వస్తే ఇంట్లోని వ్యక్తులు సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటారని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. తేలు, జెర్రి వంటివి ఇంట్లోకి వస్తే అంత మంచిది కాదని చెబుతుంటారు. ఇంట్లో శుచి శుభ్రత తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఇంట్లోకి వస్తాయి. ఇవి రావడం వల్ల ఏదో చెడు జరగబోతుందని పెద్దలు చెబుతుంటారు.