Marri Chettu : మర్రి చెట్టు.. ఇది మనందరికీ తెలిసిందే. ఈ పేరు వినగానే చాలా మందికి చిన్నతనంలో ఈ చెట్టు ఊడలతో ఆడుకున్న ఆటలు గుర్తుకు వస్తుంటాయి. ఈ మహా వృక్షం గురించి ఎంత చెప్పినా తక్కువే. మర్రి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. దీని గురించి ఆయుర్వేద గ్రంథాలలో ఎంతో గొప్పగా వర్ణించారు. మర్రి చెట్టు వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద ఉండే గొప్ప వృక్షాలలో మర్రి చెట్టు ఒకటి. సృష్టి ఉన్నంత కాలం మర్రిచెట్టు మనుగడ సాగిస్తుందని అంటుంటారు. దీనిని ఉపయోగించిన వారు దీర్ఘాయుషువు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
మర్రిచెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మర్రి చెట్టు కాయలను తినడం వల్లే కాకులు వందేళ్లు బ్రతుకుతున్నాయని చాలా మంది పెద్దలు అంటుంటారు. దీనిని సంస్కృతంలో క్షిరి, వట, నిగ్రోధ అని పిలుస్తారు. మర్రి చెట్టు శీతల స్వభావాన్ని కలిగి ప్రాణులకు జీవశక్తి అందిస్తూ ఉంటుంది. వైశాఖ మాసంలో ఈ చెట్టు కాయలను కాస్తుంది. ముఖ్యంగా ఉష్ణ శరీరతత్వం ఉన్న వారికి ఈ పండ్లు వర ప్రసాదం లాంటివి. మర్రిపుల్లలతో దంతాలను రెండు పూటలా శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల దంత సమస్యలన్నీ తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గి దంతాలు దృఢంగా మారుతాయి.
అతి మూత్ర వ్యాధి ఉన్నవారు మర్రి చెట్టు బెరడును తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే సగం వరకు మరిగించి చల్లార్చి తాగడం వల్ల అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. నడుము నొప్పిని తగ్గించడంలో కూడా మర్రి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతంది. పలుచటి నూలు వస్త్రాన్ని మర్రి పాలతో తడిపి నడుముకు పట్టీలా కట్టుకోవాలి. ఇలా మూడు పట్టీలను నడుముకు కట్టుకోవడం వల్ల ఎంతటి నడుము నొప్పైనా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మర్రి చెట్టు లేత ఆకులను నీళ్లతో కలిపి నూరి దానికి కొద్దిగా కండ చక్కెరను కలిపి మూడు పూటలా తింటూ ఉండడం వల్ల రక్త వాంతులు తగ్గుతాయి. మర్రి చెట్టు ఊడలను లేదా బెరడును తీసుకుని నీడలో ఆరబెట్టి పొడిగా చేసి పూటకు 3 గ్రా. ల చొప్పున మూడు పూటలా బియ్యం కడిగిన నీటితో కలిపి తాగడం వల్ల రక్త విరేచనాలు, బంక విరేచనాలు తగ్గుతాయి. ఈ చిట్కాను పాటించేటప్పుడు వేడి పదార్థాలు, మాంసాహారాన్ని తినకూడదు. మధుమేహాన్ని తగ్గించడంలోనూ మర్రి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. మర్రి చెట్టు బెరడు పొడిని 3గ్రా. ల చొప్పున తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి ఒక కప్పు అయ్యే వరకు మరిగించి వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగడం వల్ల మధుమేహం మటుమాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
లేత మర్రి ఆకులను 10 గ్రా. ల చొప్పున తీసుకుని వాటిని 150 గ్రా. ల నీటితో కలిపి మెత్తగా నూరి వడకట్టాలి. ఈ రసానికి కండచక్కెరను కలిపి ఆహారానికి గంట ముందు రెండు పూటలా తాగుతూ ఉంటే గుండె దడ తగ్గుతుంది. చెవిలో పురుగులు దూరినప్పుడు ముందుగా 5 లేదా 6 చుక్కల మేక పాలను వేసి తరువాత 4 లేదా 5 చుక్కల మర్రి చెట్టు పాలను వేయడం వల్ల చెవిలో దూరిన పురుగులు చచ్చి బయటకు వస్తాయి. పిప్పి పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు దూదిని మర్రి పాలతో తడిపి పిప్పి పన్నుపై ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. మర్రి పాలలో ఒక గుడ్డను తడిపి వ్రణాలపై ఉంచడం వల్ల లేత వ్రణాలు లోపలికి అణిగిపోతాయి. పెద్దగా ఉండే వ్రణాలు పగిలిపోతాయి.
ఒక చుక్క మోతాదులో మర్రిపాలను కంటిలో వేసుకోవడం వల్ల కంటిపోటు తగ్గుతుంది. లేత మర్రి చిగుళ్లను దంచి మాడుపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల ముక్క నుండి రక్తం కారడం తగ్గుతుంది. పండిన మర్రి చెట్టు ఆకులను తీసుకుని కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదకు నువ్వుల నూనెను కలిపి మెత్తగా నూరి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మొలలకు లేపనంగా రాసుకోవడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది.
లేత మర్రి ఊడలను మెత్తగా నూరి ఆ గంధాన్ని నాలుకపై రుద్దుతూ ఉంటే మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. లేత మర్రి ఆకులను తీసుకుని నీటితో నూరి రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి సమపాళ్లల్లో నువ్వుల నూనెను కలిపి కళాయిలో పోసి చిన్న మంటపై నూనె మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసిన నూనెను మర్రి తైలం అంటారు. దీనిని గాజు సీసాలోనిల్వ చేసుకుని జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ తైలాన్ని నడుము నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాడవచ్చు. ఈ తైలాన్ని రాసి పైన మర్రి ఆకులను ఉంచి కట్టు కట్టడం వల్ల నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా మర్రి చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.