మనలో అధిక శాతం మందికి జీవితం మొత్తం మీద రెండు ప్రధానమైన లక్ష్యాలు ఉంటాయి. ఒకటి సొంత ఇల్లు.. రెండోది సొంత కారు.. ఇల్లు కొనడం చాలా కష్టతరమైన విషయం. కానీ కారు మాత్రం కొద్దిగా శ్రమిస్తే మన అభిరుచులకు అనుగుణంగా ఉండే కారును సొంతం చేసుకోవచ్చు. ఇక చాలా మంది కొత్త కారు కంటే సెకండ్ హ్యాండ్ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సెకండ్ హ్యాండ్ కారును కొనేముందు ఎవరైనా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సెకండ్ హ్యాండ్ కారును కొనేముందు మొదటగా చూడాల్సిన అంశం.. కారు ఇంజిన్. ఇంజన్ కండిషన్లోనే ఉంటేనే కారు కొన్నాక ఎక్కువ కాలం పాటు రిపేర్ రాకుండా ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు తప్పుతాయి. కనుక కార్ కొనేముందు దాని ఇంజిన్‌ను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. మీకు అంత అనుభవం లేకపోతే.. కనీసం మెకానిక్‌తో అయినా కారు ఇంజిన్‌ను చెక్ చేయించాలి. కారు స్టార్ట్ చేయగానే ఇంజిన్ ఎంత సేపటికి ఆన్ అవుతుంది ? పికప్ ఎలా ఉంది ? ఇంజిన్ నుంచి ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా ? కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ? వంటి అంశాలను కూలంకశంగా పరిశీలించాలి. దీంతో కారు కండిషన్‌ను అంచనా చేయవచ్చు. ఫలితంగా కారు కొనాలో, వద్దో ఇట్టే తెలిసిపోతుంది.
2. సెకండ్ హ్యాండ్ కారును కొనేముందు కారును కచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. మెకానిక్ టెస్ట్ డ్రైవ్ చేసినా చేయకున్నా, కారు కొనేవారు మాత్రం కచ్చితంగా ఒకసారి దాన్ని నడిపి చూడాలి. దాంతో క్లచ్, యాక్సలేటర్, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉందో తెలిసిపోతుంది. కారు నడిచేందుకు ఇవి కూడా చాలా ముఖ్యమేనని గ్రహించాలి.
3. కారు కొనేముందు ఆ కారును అంతకు ముందు ఓనర్ ఎలా మెయింటెయిన్ చేశారో తెలుసుకోవాలి. సర్వీసింగ్ ఎంత వ్యవధిలో చేయించారు ? లాస్ట్ సర్వీసింగ్ చేయించి ఎన్ని రోజులు అయింది ? ఏవైనా యాక్సిడెంట్లు అయ్యాయా ? పార్ట్‌లను మార్చారా ? అన్న వివరాలను కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. దీంతో కారు స్టేటస్ తెలిసిపోతుంది. కారు కొనాలో, వద్దో సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.
4. కారుకు సంబంధించిన పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫైనాన్స్ ఉంటే క్లియర్ అయిన పత్రాలు, కారు ఎలాంటి క్రైమ్‌లో లేదని ఓనర్ చెబుతూ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు, కారుపై ఏవైనా ట్రాఫిక్ చలానాలు ఉంటే వాటిని క్లియర్ చేశాక ఇచ్చే రశీదులు.. తదితర అన్ని పత్రాలను సరి చూసుకోవాలి. అలాగే కారు కొనేముందు సేల్ డీడ్ తీసుకోవాలి. దీంతోపాటు కారు అంతకు ముందు ఓనర్‌కు చెందిన ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లను తీసుకోవాలి.
5. కొత్త కారు అయితే డీలర్ చెప్పిన ధర చెల్లించి కారు కొనాలి. కానీ సెకండ్ హ్యాండ్ కారు అయితే మనం ధర బేరమాడవచ్చు. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కొంత వరకు మనం కారు ధరలో డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఆ మొత్తం అందుకు పనికొస్తుంది.
6. సెకండ్ హ్యాండ్ కారు అయినా సరే.. అందులో ఆడియో సిస్టమ్, ఏసీ, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగులు తదితర ఫీచర్లను అందిస్తుంటారు. కొందరు ఓనర్లు కారు అమ్మే ముందు వీటిని తీసేసి కేవలం కారును మాత్రమే అమ్ముతుంటారు. అయితే నిజానికి కారు బాగుంటే.. ఈ ఫీచర్లు లేకున్నా పెద్ద ఫర్వా లేదు. వాటి కోసం అదనంగా కొంత మొత్తం వెచ్చిస్తే చాలు.. ఎటు చేసీ మనకు కారు కండిషన్ బాగుండాలి.. అంతే.. ఇతర ఫీచర్లు లేకున్నా.. కొంత మొత్తం అదనంగా చెల్లిస్తే వాటిని పొందవచ్చనే విషయం గుర్తుంచుకోవాలి.