Hotel Style Biryani Gravy : మనం ఇంట్లో అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. వీటిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది కేవలం బిర్యానీనే తయారు చేస్తూ ఉంటారు. దానిని తినడానికి గ్రేవి ఎక్కువగా తయారు చేయరు. కానీ బిర్యానీని నేరుగా తినడానికి బదులుగా బిర్యానీ గ్రేవితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీ గ్రేవిని తయారు చేయడం చాలా సులభం. రుచిగా, సులభంగా అలాగే బావర్చీ స్టైల్ లో ఈ బిర్యానీ గ్రేవిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బావర్చి స్టైల్ బిర్యానీ గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 10, ఎండు కొబ్బరి పొడి – 4 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయ పరిమాణమంత, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి – ఒకటీ స్పూన్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్.
బావర్చి స్టైల్ బిర్యానీ గ్రేవీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, అర టీ స్పూన్ నూనె వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, యాలకుల పొడి, కసూరి మెంతి వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఉప్పు, చింతపండు రసం, నీళ్లు, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నుండి 18 నిమిషాల వరకు ఉడికించాలి. చివరగా దీనిపై కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బావర్చి స్టైల్ బిర్యానీ గ్రేవీ తయారవుతుంది. దీనిని బిర్యానీ, పులావ్ వంటి వాటితో తింటే వాటి రుచి మరింత పెరుగుతుంది.