India Vs Sri Lanka : మొహాలీలో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 574 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించాడు. 228 బంతులు ఆడిన జడేజా 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే కేవలం 25 పరుగులు చేస్తే చాలు.. డబుల్ సెంచరీ చేసి ఉండేవాడు. కానీ అంతలోపే రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో రోహిత్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
రవీంద్ర జడేజాను డబుల్ సెంచరీ చేయకుండా కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు అడ్డుకున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గతంలో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పలు టెస్ట్ మ్యాచ్‌లలో ఇలాగే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చాడు. డబుల్ సెంచరీ లేదా సెంచరీకి బ్యాట్స్‌మెన్ దగ్గరగా ఉన్న సమయంలో వాటిని పూర్తి చేయనీయకుండా ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో అప్పట్లో ద్రావిడ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు కోచ్‌గా ఉన్నాడు కనుక మళ్లీ అలాగే ఇప్పుడు కూడా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో ఫ్యాన్స్ మళ్లీ ద్రావిడ్‌నే నిందిస్తున్నారు. అయితే దీనిపై రవీంద్ర జడేజా వివరణ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే..
తాను 175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మకు సిగ్నల్ ఇచ్చానని.. పిచ్ మీద బౌన్స్ బాగా ఉందని.. కొన్ని బంతులు కిందకు వస్తున్నాయని.. అలాగే కొన్ని బంతులు బాగా వేరియేట్ అవతున్నాయని.. ఇలాంటి సమయంలో బౌలింగ్‌కు పిచ్ బాగా అనుకూలంగా ఉంది కనుక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి శ్రీలంకను బ్యాటింగ్‌కు రప్పిస్తే బాగుంటుందని.. తాను భావించానని.. అదే మెసేజ్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు పంపానని.. అయితే తాను చెప్పినట్లుగానే కెప్టెన్ రోహిత్‌శర్మ, కోచ్ ద్రావిడ్‌లు నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో బలవంతం ఏమీ లేదని.. అయినా తన వ్యక్తిగత స్కోరు కన్నా.. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. జడేజా అన్నాడు. దీంతో వివాదం సద్దుమణిగినట్లు అయింది.
అయితే అప్పటికే దాదాపుగా రెండు రోజుల నుంచి లంక ప్లేయర్లు ఫీల్డింగ్ చేస్తూ బాగా అలసిపోయారని.. అలాంటి దశలో వారు బ్యాటింగ్ చేసే స్థితిలో లేరని.. పైగా పిచ్ కూడా బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది కనుక.. అలాంటి సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి లంకను బ్యాటింగ్‌కు రప్పిస్తే బాగుంటుందని కూడా జడేజా భావించాడు. అదే విషయాన్ని జడేజా వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇంకా విమర్శలకు దిగుతూనే ఉన్నారు. కేవలం 25 పరుగులే కదా.. డబుల్ సెంచరీ అయ్యాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే బాగుండేది కదా.. అంటున్నారు. ఈ విషయంలో ఇంకా చాలా మంది జడేజాకే మద్దతుగా నిలుస్తున్నారు.