Jangri : మను స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో జాంగ్రీలు కూడా ఒకటి. జాంగ్రీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే ఈ జాంగ్రీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జాంగ్రీ చుట్టడం రావాలే కానీ వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఈ జాంగ్రీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాంగ్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, బియ్యం – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, శనగపిండి – పావు కప్పు, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ – రెండు చిటికెలు, పంచదార – అరకిలో, నీళ్లు – 200 ఎమ్ ఎల్, పటిక – ఒక చిన్న ముక్క, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
జాంగ్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినపప్పును, బియ్యాన్ని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిలో శనగపిండి, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని 4 నుండి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ పలుచగా ఉండకూడదు. పిండి బోండా పిండిలాగా ఉండాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి జిగురుగా అయ్యే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు పిండిని పైపింగ్ బ్యాగ్ లోకి లేదా పాల ప్యాకెట్ లోకి తీసుకోవాలి. పాల ప్యాకెట్ కు చిన్న రంధ్రం చేసుకోవాలి. ఇప్పుడు అడుగు పలకలాగా ఉండే కళాయిలో ముప్పావు వంతు నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను చిన్నగా చేసి జాంగ్రీలను వేసుకోవాలి. ఈ జాంగ్రీలను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని పంచతదార పాకంలో రెండు వైపులా తిప్పుతూ అర నిమిషం పాటు ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే జాంగ్రీలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.