Jeera Rice : ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన వాటిల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను మనం ప్రతిరోజూ వంటల్లో వాడుతూనే ఉంటాం. వంటల రుచిని పెంచడమే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా జీలకర్ర పని చేస్తుంది. వంటల్లో ఉపయోగించడంతోపాటు జీలకర్రతో జీరా రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. తరచూ చేసుకునే జీరా రైస్ కు బదులుగా దీనిని మరింత రుచిగా రెస్టారెంట్ లో లభించే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీరా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన బాస్మతి బియ్యం – 200గ్రా., నీళ్లు – ఒకటిన్నర లీటర్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 2, సాజీరా – అర టీ స్పూన్, మిరియాలు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
జీరా రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర లీటర్ నీళ్లను పోసి వేడి చేయాలి. ఇందులోనే యాలకులను, సాజీరాను, ఉప్పును, నెయ్యిని, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను, మిరియాలను వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలపాలి. ఈ బియ్యాన్ని మధ్యస్థ మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత అన్నంలో ఉండే నీటిని పూర్తిగా వడకట్టి అన్నాన్ని పొడి పొడిగా చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత లవంగాలను, దాల్చిన చెక్కను ముక్కను, జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత తరిగిన పచ్చి మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసి అలాగే తగినంత ఉప్పును వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇక చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా బయట రెస్టారెంట్లలో లభించే విధంగా ఉండే జీరా రైస్ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా మిర్చికా సాలన్ వంటి మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడూ లేదా వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా జీరా రైస్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.