Kajjikayalu : మనం రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో కజ్జికాయలు కూడా ఒకటి. కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పండుగలకు వీటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఈ కజ్జి కాయలను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా వీటిని తయారు చేయవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా సులభంగా ఈ కజ్జి కాయలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కజ్జికాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 200 గ్రా., బెల్లం – 100 గ్రా., పుట్నాల పప్పు – 100 గ్రా., ఎండు కొబ్బరి తురుము – 50 గ్రా., యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా జార్ లో పుట్నాల పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులో బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ నూనె రాస్తూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ చపాతీని కజ్జకాయల అచ్చు మీద ఉంచాలి. తరువాత మధ్యలో రెండు టీ స్పూన్లు లేదా తగినంత పుట్నాల మిశ్రమాన్ని ఉంచాలి.
తరువాత అంచులకు నీటితో తడి చేయాలి. ఇప్పుడు కజ్జకాయలను వత్తుకుని ఎక్కువగా ఉన్న పిండిని తీసేసి కజ్జకాయను ప్లేట్ లోకి తీసుకోవాలి. కజ్జకాయల అచ్చులు లేకపోయినా లేకపోయినా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. చపాతీలా వత్తుకున్న తరువాత మధ్యలో పుట్నాల మిశ్రమాన్ని ఉంచి మధ్యలోకి మడిచి అంచులను వత్తుకోవాలి. ఇలా కజ్జకాయలను వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని కజ్జకాయలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే కజ్జకాయలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పండగలకే కాకుండా అప్పుడప్పుడూ స్నాక్స్ గా కూడా ఇలా కజ్జకాయలను తయారు చేసుకుని తినవచ్చు.