Kaju Paneer Masala Curry : మనం శరీరంలో ఉండే ఎముకలు దృఢంగా ఉండడానికి కాల్షియం అవసరమని మనందరికీ తెలుసు. కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి పాలు. పాలు లేదా పాల ఉత్పత్తులను చాలా మంది ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పాలను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. పాల ఉత్పత్తులలో పన్నీర్ కూడా ఒకటి. ఇది కూడా మనందరికీ తెలిసిందే. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం.
పనీర్ ను ఉపయోగించి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పనీర్ తో చేసే ఏ వంటకమైనా సరే చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా రెస్టారెంట్ స్టైల్ కాజు పనీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు పనీర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 150 గ్రా., జీడిపప్పు – 100 గ్రా., తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన టమాటాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, పెరుగు – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చి మిర్చి – 2.
కాజు పనీర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను, 7 లేదా 8 జీడిపప్పులను జార్ లో వేసి తగినన్ని నీళ్లను పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. టమాటాలను కూడా జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత మిగిలిన జీడి పప్పును వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో పనీర్ ముక్కలను కూడా వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో మిగిలిన నూనెను వేసి కాగిన తరువాత తరిగిన పచ్చి మిర్చిని, ముందుగా పేస్ట్ లా చేసుకున్న ఉల్లిపాయ, జీడి పప్పు మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమాట ప్యూరీని వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పును, పన్నీర్ ముక్కలను వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పెరుగును వేసి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు పనీర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితోనే కాకుండా బిర్యానీ, పులావ్ వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు. ఈ విధంగా కాజును, పనీర్ కలిపి కర్రీని చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండడమే కాకుండా కాజు, పనీర్ లో ఉండే పోషకాలు శరీరానికి లభిస్తాయి.