Kaju Patti : మనకు స్వీట్ షాపుల్లో లభించే వాటిల్లో కాజు పట్టీలు కూడా ఒకటి. జీడిపప్పు, బెల్లం కలిపి చేసే ఈ పట్టీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ కాజు పట్టీలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల స్వీట్ షాప్ స్టైల్ కాజుపట్టీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్ కాజు పట్టీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు పట్టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – ఒక కప్పు, బెల్లం – అర కప్పు,యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్.
కాజు పట్టీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పును వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లాన్ని పూర్తిగా కరిగించిన తరువాత ఉండ పాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం ఉండపాకం రాగానే యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. తరువాత జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకుని సమానంగా చేసుకోవాలి. తరువాత కత్తితో గాట్లు పెట్టుకోవాలి.ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు ఉంచి ఆ తరువాత ముక్కలుగా చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు పట్టీ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.