Kaju Pulao Rice : మనం వంటింట్లో సులభంగా చయేసుకోదగిన పులావ్ వెరైటీలలో జీడిపప్పు పులావ్ కూడా ఒకటి. జీడిపప్పుతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మసాలా కూరలతో తింటే ఈ పులావ్ మరింత రుచిగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చక్కగా ఉంటుంది. జీడిపప్పు పులావ్ ను చాలా సులభంగా, ఎటువంటి శ్రమ లేకుండా తయారు చేసుకోవచ్చు. అలాగే వంటరాని వారు కూడా దీనిని చిటికెలో తయారు చేయవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ జీడిపప్పు పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు పులావ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె -ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, లవంగాలు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, జాపత్రి – కొద్దిగా, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు -2, జీలకర్ర – అర టీ స్పూన్, జీడిపప్పు – ముప్పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, దంచిన మిరియాలు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్.
కాజు పులావ్ రైస్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత మిరియాల పొడి, ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలుపుకుని మూత పెట్టకుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పది నిమిషాల తరువాత ఈ పులావ్ రైస్ ను సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు పులావ్ రైస్ తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు. లేదంటే వెజ్, నాన్ వెజ్ మసాలా కూరలతో కూడా తినవచ్చు. ఇలా జీడిపప్పుతో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను అప్పటికప్పుడు తయారు చేసుకుని తినవచ్చు.