Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. చేదుగా ఉంటుంద‌నే కార‌ణం చేత దీనిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌లో కూడా అనేక పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం కూర‌ల‌ను, వేపుళ్ల‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాక‌ర‌కాయ‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కాక‌ర‌కాయ ఊర‌గాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కాక‌రకాయ ఊర‌గాయ‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన కాక‌ర‌కాయ‌లు – పావు కిలో( 2 క‌ప్పులు), నాన‌బెట్టిన‌ చింత‌పండు – అర క‌ప్పు, ప‌ల్లీ నూనె – ఒక‌టిన్న‌ర క‌ప్పు, క‌చ్చాప‌చ్చాగ దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఆవాలు – 3 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, మెంతులు – అర టీ స్పూన్, ఉప్పు – పావు క‌ప్పు ( 40 గ్రా. ), కారం – ముప్పావు క‌ప్పు ( 75 గ్రా. ).

Kakarakaya Nilva Pachadi recipe in telugu know how to make it
Kakarakaya Nilva Pachadi

కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మెంతుల‌ను, రెండు టీ స్పూన్ల ఆవాల‌ను వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో చింత‌పండు ర‌సం వేసి ఉడికించాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కాక‌రకాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడే అదే నూనెలో వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి అవి కొద్దిగా వేగిన త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో వేయించిన కాక‌ర‌కాయ ముక్క‌లు, ఉడికించిన చింత‌పండు, మిక్సీ ప‌ట్టుకున్న ఆవ‌పిండి వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కారాన్ని వేసి కలిపి ఒక ప్లాస్టిక్ డ‌బ్బాలో లేదా గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ‌ల‌తో కూర‌ల‌ను, కారాన్నే కాకుండా ఇలా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి రెండు నెల‌ల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల మ‌రిన్ని రోజులు తాజాగా ఉంటుంది.

Share
D

Recent Posts