Kalyana Rasam : మనం అన్నంతో కలిపి తినడానికి వివిధ రుచుల్లో రసాన్ని తయారు చేస్తూ ఉంటాం. కొందరికి ప్రతిరోజూ భోజనంలో తినడానికి ఏదో ఒక రసం ఉండాల్సిందే. ఈ రసాన్ని మనం ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా తయారు చేసే కళ్యాణ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్యాణ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కందిపప్పు – 100 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, పసుపు – ముప్పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 3, తరిగిన టమాట – 1 ( పెద్దది), ఉప్పు – తగినంత, నీళ్లు – పావు లీటర్, చింతపండు – 100 గ్రా., కరివేపాకు – మూడు రెమ్మలు, మిరియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, తరిగిన కొత్తిమీర – అర కట్ట, ఇంగువ – పావు టీ స్పూన్.
కళ్యాణ రసం తయారీ విధానం..
ముందుగా చింతపండు శుభ్రంగా కడిగి దానిలో 400 ఎమ్ ఎల్ నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత చింతపండు రసాన్ని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత రోట్లో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత పప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి పప్పు అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కరివేపాకు రెమ్మలు, చింతపండు రసం, దంచుకున్న వెల్లుల్లి మిశ్రమం, కొత్తిమీర తరుగును వేసుకోవాలి. దీనిని కదపకుండా ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి.
తరువాత ఇంగువ వేసి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కళ్యాణ రసం తయారవుతుంది. ఈ రసాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు బాధిస్తున్నప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా కళ్యాణ రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.