Karivepaku Pulihora : పులిహోర.. దీనిని రుచి చూడని వారు, ఇదంటే నచ్చని వారు ఉండరనే చెప్పవచ్చు. ప్రసాదంగా అలాగే అల్పాహారంగా దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. అలాగే చింతపండు, నిమ్మరసం, మటాటమ, గోంగూర ఇలా వివిధ రుచుల్లో ఈ పులిహోరను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం కరివేపాకుతో కూడా ఎంతో రుచికరమైన పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీగా మరింత రుచిగా కరివేపాకుతో పులిహోరును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పుల బియ్యంతో వండినంత, నూనె – 5 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – 10 రెమ్మలు, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, ఎండుమిర్చి – 6, పసుపు – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 2 నిమ్మకాయలంత, ఉప్పు – తగినంత లేదా 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 2.
కరివేపాకు పులిహోర తయారీ విధానం..
ముందుగా ఒక పెద్ద గిన్నెలో అన్నాన్ని వేసి పొడి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత పల్లీలు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మరో రెండు రెమ్మల కరివేపాకు వేసి కలపాలి. ఇవన్నీ వేగిన తరువాత పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును అన్నంలో వేసి మరలా అదే కళాయిని స్టవ్ మీద ఉంచి అందులో చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి.
ఈ చింతపండు గుజ్జును నీరంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేయించిన కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చింతపండు గుజ్జును కూడా వేసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పులిహోర తయారవుతుంది. పండుగలకు, లంచ్ బాక్స్ లోకి, అన్నం మిగిలినప్పుడు ఇలా కరివేపాకు పులిహోరను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.