Karivepaku Rasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. రసం చాలా రుచిగా ఉంటుంది. రసంతో తింటే కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ రసాన్ని తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రసం వెరైటీలలో కరివేపాకు రసం కూడా ఒకటి. వంటల్లో వాడే కరివేపాకుతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కరివేపాకుతో చేసే ఈ రసాన్ని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. లొట్టలేసుకుంటూ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కరివేపాకు రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 3, తరిగిన టమాట – 1, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రసం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – అర కప్పు, పచ్చిమిర్చి – 2.
కరివేపాకు రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో రసం పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. కరివేపాకును కరకరలాడే వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పసుపు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఈ రసాన్ని 2 నుండి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు రసం తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలా కరివేపాకు రసాన్ని తయారు చేసుకుని వేడి వేడిగా తింటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.