Katte Pongali Recipe : పొంగలి అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది ప్రసాదంగా వండుతారు. కానీ ఉదయం అల్పాహారంగా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక కట్టె పొంగలి.. పెసరపప్పుతో చేసే ఈ పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ఆలయాల్లో ప్రసాదంగా ఎక్కువగా ఈ పొంగలిని పెడుతుంటారు. చక్కటి వాసనను, రుచిని కలిగి ఉండే ఈ పొంగలిని ముద్దగా అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కట్టె పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పెసరపప్పు – ఒక కప్పు, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – తగినంత, నెయ్యి – అర కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – రెండు చిటికెలు.
కట్టె పొంగలి తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత కళాయిలో పెసరపప్పును తీసుకుని చిన్న మంట పై దోరగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులోనే ఉప్పు వేసి కలపాలి. నీళ్లు వేడయ్యాక నానబెట్టుకున్న బియ్యాన్ని, వేయించిన పెసరపప్పును వేసి ఉడికించాలి. బియ్యం, పెసరపప్పు మెత్తగా ఉడికి దగ్గర పడుతుండగా మంటను చిన్నగా చేసి మూత పెట్టి ఉంచాలి. తరువాత మరో కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
తరువాత జీలకర్ర, మిరియాలు, ఇంగువ వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తాళింపును మూత పెట్టి ఉడికిస్తున్న పొంగల్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. 15 నిమిషాల తరువాత ఈ పొంగల్ ను సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఆలయాల్లో ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలి తయారవుతుంది. ఈ పొంగల్ వేడిగా ఉన్నప్పుడు పలుచగా ఉన్నా చల్లారే కొద్ది గట్టి పడుతుంది. దీనిని ఉదయం అల్పాహారంగా తయారు చేసుకుని తినవచ్చు.