Kerala Parota : కేరళ పరోటాలు.. ఈ పేరు మనలో చాలా మంది వినే ఉంటారు. అలాగే ఈ పరోటాలను కూడా మనలో చాలా మంది తినే ఉంటారు. ఇవి మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కేరళ పరోటాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేరళ పరోటాలను చక్కటి రుచితో సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – అర కప్పు, గోధుమ పిండి – అర కప్పు, పంచదార – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, బొంబాయి రవ్వ – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని.
కేరళ పరోటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పంచదార, ఉప్పు, బొంబాయి రవ్వ వేసుకోవాలి. తరువాత పావు కప్పునీళ్లు పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత గోధుమ పిండి, మైదా పిండి వేసి తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని 10 నిమిషాల పాటు బాగా వత్తుకుని రెండు భాగాలుగా చేయాలి. తరువాత వాటిపై కొద్దిగా నూనె రాసి తడి వస్త్రాన్ని కప్పి 30 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఒక్కో పిండి ముద్దను తీసుకుని నూనె రాసిన ఫ్లోర్ మీద ఉంచి వీలైనంత పలుచగా వత్తుకోవాలి. తరువాత దానిపై 2 టీ స్పూన్ల నెయ్యిని, ఒక టీ స్పూన్ కరిగించిన బటర్ ను వేసి పరోటా అంతా వచ్చేలా రాసుకోవాలి. తరువాత దానిపై కొద్దిగా పొడి మైదాపిండిని చల్లుకోవాలి. తరువాత చాకుతో పరోటాను వీలైనంత చిన్నగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పరోటాను ముక్కలు తెగిపోకుండా ఒక చివరి నుండి మొదలు పెట్టి గుండ్రంగా నెమ్మదిగా చుట్టుకోవాలి. తరువాత పిండిని రోల్ చేసుకుని నూనె రాసుకుంటూ చపాతీ కర్రతో పరోటాలా వత్తుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పరోటాను వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవాలి. తరువాత నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకున్న తరువాత ఒకదాని మీద ఒకటి ఉంచి పరోటాలను రెండు చేతులతో బాగా వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పరోటా పొరలు పొరలుగా చక్కగా విడిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కేరళ పరోటా తయారవుతుంది. దీనిని వెజ్ కుర్మా, చపాతీ కూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అప్పుడప్పుడూ కేరళ పరోటాలను తయారు చేసుకుని తినవచ్చు. వేడి వేడిగా ఎన్ని తిన్నారో కూడా తెలియనంతగా ఇంట్లో అందరూ ఇష్టంగా ఈ పరోటాలను తింటారు.