Kobbari Gullalu : మనం పచ్చి కొబ్బరితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బరితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పచ్చి కొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొబ్బరి గుల్లలు కూడా ఒకటి. వీటిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ గుల్లలు తియ్యగా, పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఈ గుల్లలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గుల్లలను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి గుల్లలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి గుల్లల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన రేషన్ బియ్యం – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, పంచదార – రెండు కప్పులు, నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, వంటసోడా – రెండు చిటికెలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కొబ్బరి గుల్లల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టిన బియ్యం, పచ్చికొబ్బరి తురుమును తీసుకోవాలి. తరువాత చల్లటి నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి గులాబ్ జామున్ పాకంలా అయ్యే వరకు ఉడికించాలి. పంచదార పాకం కొద్దిగా జిగురుగా అవ్వగానే ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని చెక్క అప్ప ఆకారంలో నూనెలో వేసుకోవాలి. ఈ గారెలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు పంచదార పాకంలో ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి గుల్లలు తయారవుతాయి. వీటిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే తీపి వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కొబ్బరి గుల్లలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.