Kobbari Kajjikayalu : కొబ్బరి కజ్జి కాయలు.. ఈ తీపి వంటకం గురించి మనందరికి తెలిసిందే. వీటిని పండుగలకు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ కజ్జికాయలను చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు మొదటి సారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మృదువుగా , రుచిగా ఉండేలా ఈ కొబ్బరి కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి కజ్జి కాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, పచ్చి కొబ్బరి తురుము – రెండు కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, కచ్చా పచ్చాగా దంచిన యాలకులు – 4, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కొబ్బరి కజ్జి కాయల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో కొబ్బరి తురుము, బెల్లం, యాలకులు వేసి వేడి చేయాలి. దీనిని చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. బెల్లం కరిగి దగ్గర పడే వరకు బాగా వేయించాలి. బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని ఉండగా చేసి చూడాలి. ఈ మిశ్రమం ఉండగా చేయడానికి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత గిన్నెలో మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత రెండు టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి చపాతీ పిండిలా కలుపుకున్న తరువాత తగినంత పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని నూనె లేదా పొడి పిండి వేసుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు వత్తే చెక్కను తీసుకుని దానిపై ముందుగా వత్తుకున్న చపాతీని ఉంచాలి. తరువాత అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కొబ్బరి మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత అంచులకు తడి చేసి గట్టిగా వత్తుకోవాలి. ఎక్కువగా ఉండే పిండిని తీసేసి కజ్జికాయలను ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కజ్జికాయలను వేసుకుని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి కజ్జికాయలు తయారవుతాయి. కజ్జికాయల చెక్క లేని వారు చపాతీని చిన్నగా చేసుకుని అందులో కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి మధ్యలోకి మడిచి అంచులను ఫోర్క్ తో వత్తుకోవాలి. తరువాత వీటిని నూనెలో వేసి కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కజ్జికాయలు తయారవుతాయి. పండుగలకు లేదా తీపి వంటకాలు తినాలనిపించినప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే కొబ్బరి కజ్జికాయలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.