Kobbari Pachadi : కొబ్బరిని పచ్చిగా లేదా ఎండుగా.. ఎలా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. దీంతో మనం అనేక రకాల తీపి లేదా కారం వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాంటి వంటకాల్లో కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. అయితే కొబ్బరితో చేసే తీపి వంటకాలు చాలా మందికి నచ్చుతాయి. కానీ కారం వంటకాలు నచ్చవు. కొబ్బరి పచ్చడిని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. కానీ ఇది ఎంతో ఆరోగ్యకరమైంది. రోజూ ఉదయం తినే ఇడ్లీ, దోశ వంటి వాటితో కొబ్బరి చట్నీని తింటే మేలు చేస్తుంది. అయితే రుచిగా ఉండాలంటే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, టమాటాలు – 2 (ముక్కలుగా చేసుకోవాలి), చింత పండు – 10 గ్రా., ఎండు మిర్చి – 15, వెల్లుల్లి రెబ్బలు – 6 లేదా7, నీళ్లు – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక.. ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొబ్బరి ముక్కలను వేసి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ అదే కళాయిలో టమాటా ముక్కలను, చింతపండును వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులోనే వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు మళ్లీ అందులోనే ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను, చింతపండును వేసి, కొద్దిగా నీళ్లను పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక.. తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలిపి.. రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంతోపాటు దోశ, పెసరట్టు, ఇడ్లీ వంటి వాటితో కలిపి ఈ పచ్చడిని తింటే రుచిగా ఉండడమే కాకుండా.. కొబ్బరిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.