Kodiguddu Bajji : ప్రోటీన్స్ ను అధికంగా కలిగి ఉన్న ఆహారాల్లో కోడి గుడ్డు ఒకటి. కోడి గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కోడిగుడ్డులో ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు కోడిగుడ్డు ఎంతో సహాయపడుతుంది. కోడి గుడ్డును తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడి గుడ్డుతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కోడి గుడ్డుతో స్నాక్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడి గుడ్డుతో తయారు చేసే స్నాక్స్ లో ఎగ్ బజ్జీ ఒకటి. ఇది బయట మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అయితే చాలా సులువుగా మనం ఇంట్లో కూడా ఎగ్ బజ్జీని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎగ్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, శనగ పిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దగా ఉన్నది), పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, జీలర్ర పొడి – చిటికెడు, ధనియాల పొడి – చిటికెడు, సోడా ఉప్పు – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, నీళ్లు – తగినన్ని.
ఎగ్ బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని నూనె, ఎగ్స్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా బజ్జీ మిశ్రమంలా కలుపుకోవాలి. తరువాత గుంతగా ఉండే కళాయిలో నూనె పోసి, నూనె వేడయ్యాక ఎగ్స్ ను శనగ పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ పై టిష్యూ పేపర్ ను ఉంచి అందులోకి తీసుకోవాలి. ఇప్పడు ఎగ్ బజ్జీని నిలువుగా కట్ చేసుకుని దానిపై చిన్నగా తరిగిన ఉల్లిపాయలతో పాటుగా కొద్దిగా కారాన్ని, ధనియాల పొడిని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బజ్జీ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో అప్పడప్పుడూ ఇలా ఎగ్ బజ్జీని తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా కోడి గుడ్డులో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు.